## హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 18 ప్రాజెక్టులపై టీజీపీసీబీ టాస్క్‌ఫోర్స్ తనిఖీలు.. నాలుగు ప్రాజెక్టుల మూసివేతకు సిఫార్సు
# నిర్మాణ ప్రాజెక్టుల్లో కాలుష్య నియంత్రణ నిబంధనల ఉల్లంఘన!
## హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 18 ప్రాజెక్టులపై టీజీపీసీబీ టాస్క్‌ఫోర్స్ తనిఖీలు.. నాలుగు ప్రాజెక్టుల మూసివేతకు సిఫార్సు
**హైదరాబాద్, నవంబర్ 11:**
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణ ప్రాజెక్టుల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళితో వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) రంగంలోకి దిగింది. రోలింగ్ టాస్క్‌ఫోర్స్ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో పలు నిర్మాణ సంస్థలు పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించాయి. మొత్తం 18 నిర్మాణ ప్రాజెక్టుల్లో కాలుష్య నియంత్రణ చర్యల అమలుపై బుధవారం సనత్‌నగర్‌లోని టీజీపీసీబీ ప్రధాన కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ సమీక్ష నిర్వహించింది.
**10 మీటర్ల విండ్ బ్రేకింగ్ వాల్స్ ఏవి?**
నిర్మాణ ప్రాంగణాల చుట్టూ కనీసం 10 మీటర్ల ఎత్తులో విండ్ బ్రేకింగ్ వాల్స్ ఏర్పాటు చేయకపోవడం, అంతర్గత రహదారులు, పాదచారుల మార్గాల్లో దుమ్ము పేరుకుపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. వాహనాల రాకపోకల సమయంలో దుమ్ము ఎగసిపడకుండా రహదారులను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, నీటిని చల్లడం వంటి చర్యలు చేపట్టడం లేదని నిర్ధారించారు.
ఇసుక, నిర్మాణ సామగ్రి, శిథిలాలను బహిరంగ ప్రదేశాల్లో నిల్వ చేయడం, నిర్మాణ వ్యర్థాలను పై అంతస్తుల నుంచి కిందకు తరలించేందుకు అవసరమైన చ్యూట్స్ ఏర్పాటు చేయకపోవడం, స్ప్రింక్లర్ వ్యవస్థను సక్రమంగా నిర్వహించకపోవడం వంటి ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.
అంతేకాకుండా, పర్యావరణానికి తక్కువ శబ్ద ఇబ్బంది కలిగించే HDPE చ్యూట్స్‌కు బదులుగా MS డ్రమ్ చ్యూట్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కొన్ని ప్రాజెక్టుల వద్ద వాణిజ్య ప్రాంతాలకు నిర్దేశించిన పగటిపూట 65 డెసిబెల్స్ శబ్ద పరిమితిని మించినట్లు అధికారులు పేర్కొన్నారు. నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణ నిబంధనలు పాటించకపోవడం, వ్యర్థాల తరలింపునకు సంబంధించిన రికార్డులు సమర్పించకపోవడం, ప్రాంగణాల చుట్టూ శిథిలాలు పేరుకుపోయేలా వదిలేయడం వంటి లోపాలు కూడా బయటపడ్డాయి.
**నాలుగు ప్రాజెక్టుల మూసివేతకు సిఫార్సు**
స్థాపనా అనుమతి (Consent for Establishment) పొందకుండానే నిర్మాణ కార్యకలాపాలు కొనసాగిస్తున్న నాలుగు ప్రాజెక్టులకు మూసివేత ఉత్తర్వులు జారీ చేయాలని టాస్క్‌ఫోర్స్ కమిటీ సిఫార్సు చేసింది. మరో నిర్మాణ ప్రాజెక్టులో నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో పనులు నిలిపివేయాలని సూచించింది.
అదేవిధంగా, నిర్వహణ అనుమతి (Consent for Operation) లేకుండా, తగిన కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకుండా పనిచేస్తున్న ఒక నిర్మాణ ప్రాజెక్టుకు అనుబంధమైన రెడీ మిక్స్ కాంక్రీట్ (RMC) ప్లాంట్‌ను మూసివేయాలని సిఫార్సు చేసింది.
**పర్యావరణ పరిహారం.. బ్యాంకు గ్యారెంటీల జప్తు**
తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన ప్రాజెక్టులపై పర్యావరణ పరిహారం విధించాలని, ఇతర ఉల్లంఘనలకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీలను జప్తు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. గుర్తించిన లోపాలను సరిదిద్దుకునేందుకు సంబంధిత నిర్మాణ సంస్థలకు 10 రోజుల గడువు ఇవ్వాలని సూచించింది.
టాస్క్‌ఫోర్స్ కమిటీ సిఫార్సుల ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన ప్రాజెక్టులపై పర్యావరణ పరిహారం విధించడం, బ్యాంకు గ్యారెంటీల జప్తు, మూసివేత తదితర చర్యలు చేపట్టనున్నట్లు టీజీపీసీబీ వెల్లడించింది.
**నిర్మాణ రంగంలో కాలుష్య నియంత్రణ చర్యలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా? అనేది నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.**

Comments
Post a Comment