అండాల సేకరణ అక్రమ దందాపై సర్కారు ఉక్కుపాదం: 7 ఐవీఎఫ్‌ కేంద్రాలకు షోకాజ్ నోటీసులు


 అండాల సేకరణ అక్రమ దందాపై సర్కారు ఉక్కుపాదం: 7 ఐవీఎఫ్‌ కేంద్రాలకు షోకాజ్ నోటీసులు

హైదరాబాద్:

తెలంగాణలో అండాల సేకరణ ముసుగులో జరుగుతున్న అక్రమ దందాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఐవీఎఫ్‌ (IVF) కేంద్రాలు, మధ్యవర్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టాయి.

రాష్ట్రంలో ఉన్న మొత్తం 44 అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) కేంద్రాలకు గాను, అధికారులు ఇప్పటివరకు 27 కేంద్రాల్లో తనిఖీలు పూర్తి చేశారు. ఈ సోదాల్లో ఏడు ప్రముఖ ఆసుపత్రుల్లో 13 రకాల నిబంధనల ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన సదరు ఆసుపత్రుల యాజమాన్యాలకు టాస్క్‌ఫోర్స్ అధికారులు ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మిగిలిన కేంద్రాల్లోనూ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.

ఢిల్లీ నేషనల్ రిజిస్ట్రీ రంగంలోకి...

ఈ అక్రమ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు వైద్య అధికారుల బృందం నవంబర్‌ 6న న్యూఢిల్లీలోని 'నేషనల్‌ ఏఆర్టీ అండ్ సరోగసీ రిజిస్ట్రీ'ని సందర్శించింది. తెలంగాణలో నమోదైన ఏఆర్టీ కేంద్రాలు, ఏఆర్టీ బ్యాంకులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించింది. ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉన్న రికార్డులను, జాతీయ రిజిస్ట్రీ నుంచి అందిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తదుపరి కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఈ దందాలో పలువురు మహిళలను గుర్తించగా, ఇందులో భాగస్వాములైన వైద్యులు, ఐవీఎఫ్‌ కేంద్రాల నిర్వాహకులు, మధ్యవర్తుల పాత్రపై సమగ్ర విచారణ జరుగుతోంది.

ప్రభుత్వం కఠిన హెచ్చరిక: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

'అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం–2021' ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా మహిళల నుంచి అండాలను సేకరించడం చట్టరీత్యా భారీ శిక్షార్హమైన నేరమని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని ఏఆర్టీ క్లినిక్‌లు, బ్యాంకులు తప్పనిసరిగా చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్‌ కలిగి ఉండాలని, నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

మధ్యవర్తుల మాయమాటలు, ఆర్థిక ప్రలోభాలకు లోనై మహిళలు తమ ఆరోగ్యాలను పాడుచేసుకోవద్దని, అక్రమ వైద్య విధానాలకు బలికావద్దని కమిషనర్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ఎక్కడైనా ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే, వెంటనే సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు (DMHO) ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరింది.


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు